ఇళయరాజా అలా చేసినందువల్లే వంశీ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాల్సి వచ్చింది!
on Feb 7, 2024
వంశీ, ఇళయరాజా కాంబినేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయా సినిమాల్లోని మధురమైన పాటలు అందర్నీ అలరించాయి. వంశీ తన కెరీర్‌లో 26 సినిమాలను డైరెక్ట్ చేస్తే అందులో 12 సినిమాలకు ఇళయరాజా సంగీతం అందించారు. ఇంత మంచి కాంబినేషన్ ఎందుకు విడిపోయింది? వంశీ మ్యూజిక్ డైరెక్టర్ అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? ఆ తర్వాత చక్రితో కాంబినేషన్ కంటిన్యూ చేస్తూ ఇళయరాజాను గుర్తు తెచ్చే పాటల్ని చెయ్యాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే.. అసలు వారి మధ్య ఏం జరిగింది అనేది వంశీ మాటల్లో తెలుసుకుందాం.
‘సితారతో మొదలైన మా ప్రయాణం ఎన్నో సంవత్సరాలు కొనసాగింది. ఆయన నన్ను ఎంతగానో ఆదరించారు. డైరెక్టర్‌గానే కాకుండా, బోయ్‌గా, కొడుకుగా..ఇలా నాపట్ల ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. ఇళయరాజాగారు కొంచెం యారగెంట్‌గా ఉంటారు. కానీ, నా విషయంలో అలా ఎప్పుడూ లేరు. ఏ డైరెక్టర్‌కీ దక్కని మరో అద్భుతమైన అవకాశం ఏమిటంటే.. నాకు ఎన్ని ట్యూన్స్ కావాలంటే అన్ని ట్యూన్స్ ఇచ్చేవారు. సాధారణంగా ఏ డైరెక్టర్‌కి అయిన అతని సినిమాలు ఐదు పాటలు ఉన్నాయంటే.. ఐదు ట్యూన్లే ఇచ్చేవారు. కానీ, నా విషయంలో పూర్తి భిన్నంగా ఉండేది. ఎన్ని ట్యూన్లు కావాలంటే అన్ని ట్యూన్లు ఇచ్చేవారు. ఒక పాటకి 100 ట్యూన్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో నాకు కావాల్సింది సెలెక్ట్ చేసుకునేవాడిని. నామీద అంత ప్రేమాభిమానాలు చూపించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి.. ‘లేడీస్ టైలర్’లోని ‘గోపీలోల..’ పాటను షూట్ చెయ్యాలి. అది గ్రూప్ డాన్సర్స్‌తో కూడిన పాట. కానీ, ఇళయరాజాగారు ఆ పాటను ఇంకా రికార్డ్ చెయ్యలేదు. సౌండ్ లేకుండా నగారాలో ఉండే టెంపోతో ఆ పాట షూటింగ్ కంప్లీట్ చేసేశాను. ఈ విషయం ఆయనకి చెప్పలేదు. మరుసటి రోజు ఉదయం ఆ పాటను రికార్డ్ చేశారు. మధ్యాహ్నం ఎడిటింగ్ స్టార్ట్ చేసి సాయంత్రానికి ఆయనకి పాట చూపించాను. ఇలా నా లైఫ్‌లో ఎప్పుడూ జరగలేదు. సౌండ్ లేకుండా పాటెలా తీశావు అని ఆశ్చర్యపోయారు. సినిమాల విషయం పక్కన పెడితే మేమిద్దరం కలిసి ట్రావెల్ చేసేవాళ్ళం. ఎంతో మంది స్వామీజీల దగ్గరకు, అడవుల్లోకి, ఆశ్రమాలకు నన్ను తీసుకెళ్ళేవారు. అలాంటి మా మధ్య దూరం పెరగడానికి కారణం.. ఒక పెద్ద ప్రొడ్యూసర్. నేను ‘జోకర్’ సినిమా చేస్తున్న టైమ్‌లో ఆ సినిమాకి మ్యూజిక్ చెయ్యడానికి భారీ రెమ్యునరేషన్ అడిగారు ఇళయరాజాగారు. అంత ఎమౌంట్ ఇస్తేనే చేస్తాను, లేకపోతే లేదు అని సీరియస్‌గా చెప్పారు. ఓపక్క నిర్మాత వెళ్ళిపోయేలా ఉన్నాడు. అందుకే ఆ సినిమాతో నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. అలా ఎందుకు అన్నారనే విషయం నాకు తర్వాత చెప్పారు. ఇళయారాజాగారు ఒక సినిమాకి మ్యూజిక్ చేశారు. చాలా పెద్ద ప్రొడ్యూసర్‌ది ఆ సినిమా. రికార్డింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఆ నిర్మాతకు సంబంధించిన వ్యక్తి వచ్చి కొంత ఎమౌంట్ ఇచ్చి.. ‘మా ప్రొడ్యూసర్‌గారు మీకు ఇంతే ఇమ్మన్నారు. మా పాలసీ ప్రకారం అంతే ఇస్తామని చెప్పారు’ అన్నాడు. ‘నా రెమ్యునరేషన్ మీ ప్రొడ్యూసర్ డిసైడ్ చేస్తున్నాడా.. అయితే నాకూ ఓ పాలసీ ఉంది. ఈ డబ్బు తీసుకెళ్ళిపో. నాకు అవసరం లేదు’ అని పంపించేశారు. అందుకే తర్వాతి సినిమా విషయంలో అంత నిక్కచ్చిగా ఉన్నారు. ఆ ఎఫెక్ట్ నాపై పడిరది. అలా నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను’ అని వివరించారు డైరెక్టర్ వంశీ.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
